Friday, December 13, 2024

Delhi | బోర్డర్‌లో ఏదైనా యుద్ధం చేసి వచ్చారా… బన్నీ అరెస్ట్‌పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్‌ !

ఆంధ్రప్రభ బ్యూరో : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. దేశంలో సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌ ఎందుకు అరెస్ట్‌ అయ్యారు అని ప్రశ్నించారు. అంటే ఈ దేశంలో రాజ్యాంగం ముందు సామాన్యుల నుంచి ప్రధాని వరకు ఒకటే అని అర్థం కాదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌లో మాట్లాడారు…

- Advertisement -

“సరైన సమాచారం, ఏర్పాట్లు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేట‌ర్ కు వచ్చారన్నారు. ఈ సందర్భంగా థియేటర్‌ ముందు జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చావుబతుకుల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు.

10 రోజుల తర్వాత అల్లు అర్జున్‌ను పోలీసులు కలిశారు. అల్లు అర్జున్‌ స్వయంగా పోలీసులతో కలిసి వచ్చారు. ఆ తర్వాత పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు బెయిల్‌ ఇచ్చింది.. అది వేరే విషయం. అయితే, ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత కూడా కేసు పెట్టలేదంటే సినిమా నటుల కోసం ప్రత్యేక రాజ్యాంగం, చట్టం ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తారు కదా” అని సీఎం రేవంత్ అన్నారు.

“తమ ప్రభుత్వం దృష్టిలో అక్కడ నేరం జరిగిందా లేదా అన్నదే ముఖ్యం… అంతే తప్ప ఆయన స్టారా.. పొలిటికల్‌ స్టారా అన్నది మాకు ముఖ్యం కాదు. పైగా అల్లు అర్జున్‌ కారులో వచ్చి సినిమా చూసి వెళ్లిపోలేదు. కార్‌ ఎక్కి చేతులూపుతూ అక్కడి జనాన్ని ఉత్సాహపరిచాడు. అప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.” అని అన్నారు.

“అల్లు అర్జున్‌ చిన్నప్పటి నుంచి తెలుసు. స్కూలుకు వెళ్లే వయసు నుంచి తెలుసు అని వెల్లడించారు. అల్లు అర్జున్‌ మామ చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ నేత అని.. ఆయనకు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీకే చెందిన లీడర్‌ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. పైగా తనకు బంధువు కూడా అని వెల్లడించారు. అల్లు అర్జున్‌ భార్య నాకు బంధువే అవుతుంది. బంధుత్వంతోనే, పరిచయంతో పని కాదు. ఇది పోలీసుల పని. వారి పని వారు చేసుకున్నారు. హోం శాఖ నా చేతిలోనే ఉంది. ఈ ఘటనపై కూడా రిపోర్ట్‌ తీసుకున్నాను.

అల్లు అర్జున్‌ అరెస్టుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయంటే అది నిజం కాదు. అలా ఎవరైనా అనుమతి లేకుండా నిరసన తెలిపితే జైలుకు పోతారు. ఒక మనిషిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తే ఇంత చర్చ చేస్తున్నారు. కానీ ఒక మహిళ చనిపోయింది. ఆమె గురించి ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. ఆమె కొడుకు పరిస్థితి ఏంటని వాకబు చేయడం లేదు. సినిమా నటులకు ఇదొక వ్యాపారం. డబ్బులు పెట్టారు. సినిమా తీశారు. సంపాదించుకున్నారు. వీళ్లేమైనా దేశం కోసం ఇండియా-పాకిస్తాన్‌ సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేసి విజయాలు సాధించి పెట్టారా?” అని సీఎం రేవంత్‌ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement