Saturday, November 23, 2024

Revanth Tour | పెట్టుబడుల వేటలో సీఎం రేవంత్‌ సక్సెస్‌ టూర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేపట్టిన పర్యటన విజయవంతం అయ్యింది. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించడంలో రేవంత్‌ బృందం విజయం సాధించింది.

పెట్టుబడుల వేటలో భాగంగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో సీఎం రేవంత్‌ బృందం అనేక కంపెనీలతో సమావేశమై పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికా నుంచి దాదాపు రూ.31వేల కోట్ల రుపాయల విలువైన పెట్టుబడులు, 30వేలకు పైగా ఉద్యోగాలు తెలంగాణకు రానున్నాయి.

పది రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో పర్యటించారు. 10 రోజుల పాటు నిర్విరామంగా సాగిన విదేశీయానం అనంతరం సీఎం రేవంత్ రేపు ఉదయం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. వచ్చి రాగానే ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తుది విడత రుణమాఫీ నిధులకు సంబంధించి ఆర్థిక శాఖతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.

ఇక‌ గురువారం పంద్రాగస్టు రోజున గోల్కొంగ కోటలో జాతీయ జెండాను విష్కరించి తెలంగాణ అభివృద్ధి ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో నిర్మాణం పూర్తయిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు.

- Advertisement -

తుది విడత రుణమాఫీ నిధులు విధుల విడుదల కూడా అక్కడి నుంచే విడుదల చేస్తారు. 16 లేదా 17న రేవంత్‌ రెడ్డి ఢిల్లికి వెళ్లనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం తదితర అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశమై తుదినిర్ణయం తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement