హైదరాబాద్ లో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దాదాపు 57 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీ జరగడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
కాగా, డిసెంబర్ 14 – 31 వరకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 37 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ సంతోష్ ట్రోఫీకి సంబంధించి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, జీ వంశీ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రోహిణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.