ప్రజాప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్సలు చేయించుకుని వినికిడి లోపాల నుంచి కోలుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇటీవల విజయవంతంగా సర్జరీలు చేయించుకున్న చిన్నారుల్లో కొందరు తమ కుటుంబాలతో కలిసి సోమవారం సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రితో రాఖీ సంబురాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పిల్లలు ఎవరైనా ఖరీదైన వైద్యం అందక మూగ, చెవిటి వారుగా మిగిలిపోవద్దని చెప్పారు. అలాంటి వారికి ఎంత ఖర్చయినా సరే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించినందుకు పిల్లల కుటుంబీకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఠి ENT ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్య గారు, వైద్యురాలు డాక్టర్ డీకే వీణ పాల్గొన్నారు.
పుట్టుకతో వినికిడి సమస్యలున్న పిల్లలకు ఐదేండ్ల వయసులోపు చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలు ఎక్కువ. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అలాంటి చిన్నారుల వైద్యానికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందిస్తున్నారు. హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో కోక్లియర్ ఇంప్లాంట్ (cochlear Implant) సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఎల్‌వోసీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా చిన్నారులకు ఉచితంగా సర్జరీలు చేయడం, ఖరీదైన వినికిడి యంత్రాలు అందించడమే కాకుండా ఏడాది పాటు AVT( Auditions Verbal Therapy) కూడా అందిస్తున్నారు.