Thursday, January 16, 2025

ఢిల్లీలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో భేటీ !

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్‌లో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నివేదిక ఇచ్చారు. కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలియజేశారు. అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారుల నిర్మాణం, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, పీఎంజీఎస్ వైతో పాటు పొరుగు రాష్ట్రాలను కలిపే రహదారుల నిర్మాణం ఆగిపోయిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రితో భేటీ

హైదరాబాద్ మహానగరంలో కాలుష్య నియంత్రణ లక్ష్యంలో భాగంగా 100 శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌గా మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కుమార‌స్వామిని వారి కార్యాల‌యంలో కలిసి ఈ విషయంపై చర్చించారు.

ఈ సందర్భంగా జీసీసీ విధానంలో పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద తెలంగాణకు బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్‌లు అమర్చి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే అవకాశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌కు జీసీసీతో పాటు రెట్రో ఫిట్‌మెంట్ మోడల్‌లో 2,800 బస్సులను కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఉక్కు శాఖ స‌హాయ మంత్రిని క‌లిసిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌లు, ఉక్కు శాఖ స‌హాయ మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మ‌ని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి ప‌లు అంశాల‌పై వారితో చ‌ర్చించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు, పర్యాటక శాఖకు సంబంధించిన కొన్ని అటవీ భూములకు సంబంధించి పర్యావరణ అనుమకులు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నది. వీటికి సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని భూపేంద్ర యాదవ్ ను సీఎం కోరినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement