తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారు.. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రగతిభవన్‌లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం ప్రగతిభవన్ ముందు గద్దర్ గంటల తరబడి నిరీక్షించినా.. లోనికి అనుమతించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టామన్నారు. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం.. తమది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. నిండు సభలో ప్రజా స్వామ్యం కుని చేశారు. కోమటిరెడ్డి, సంపత్ లాంటి వాళ్ళను బయటకు గెంటివేసిన ప్రభుత్వం మీదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. నిరసన తెలిపినందుకు సభ్యత్వం రద్దు చేసిన చీకటి రోజు కూడా ఈ సభలోనే జరిగిందని సీఎం రేవంత్ తెలిపారు.