Sunday, December 22, 2024

TG | క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్..

రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇవాళ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరుకాగా… రాష్ట్రంలోని ప్రముఖ చర్చి ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇక‌ ఈ వేడుకలో వేలాది మంది క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ కేక్‌ను కట్ చేసి, అందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని మతాలకు సమాన రక్షణ కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానమన్నారు. సర్వమత సమానత్వం విషయంలో ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.

క్రిస్‌మస్ పండుగ జరుపుకునే డిసెంబర్‌ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ ప్రకటన వెలువడిన నెల అని గుర్తుచేశారు. ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రమంతా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని చెప్పారు. విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, హైదరాబాద్ రెసిడెంట్ & ప్రిసైడింగ్ బిషప్ ఎం.ఏ. డానియల్, ఎవాంజలిస్ట్ డాక్టర్ ఎన్ జయపాల్, కల్వరి టెంపుల్ పాస్టర్ డాక్టర్ సతీష్, బిషప్ రూబెన్ మార్క్ తో పాటు క్రిస్టియన్ పెద్దలు పాల్గొన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement