Friday, November 22, 2024

Delhi | సీఎం గారూ తీన్మార్ మల్లన్న, విఠల్‌ను వదిలేయండి: కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, విఠల్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని వదిలేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్)ను కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగు ముఖ్యమంత్రులిద్దరికీ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ.. వారిద్దరి మనసులు మారాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణలో అరెస్టైన జర్నలిస్టు కుటుంబాలకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. తీన్మార్ మల్లన్న, విఠల్ విషయంలో కేసీఆర్ తండ్రిలా వ్యవహరించాలని సూచించారు. “మీ పిల్లలు తప్పు చేస్తే క్షమించరా? అలాగే ఈ ఇద్దరినీ క్షమించండి” అంటూ విజ్ఞప్తి చేశారు.

మల్లన్న, విఠల్ ఇద్దరూ హద్దు మీర ప్రవర్తించి ఉండొచ్చని, వారు ఉపయోగించిన భాష ఆమోదయోగ్యం కాకపోవచ్చని, అయినప్పటికీ పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు. అసభ్యకరంగా, అన్‌పార్లమెంటరీ పదాలతో మాట్లాడడం మంచిది కాదని కేఏ పాల్ అన్నారు. “యథా రాజ తథా ప్రజ” అన్న చందంగా సీఎం వ్యవహారశైలి ఎలా ఉంటే ప్రజలు కూడా అలా ఉంటారని అన్నారు. మరోవైపు పోలీసులు కూడా తప్పుడు కేసులు పెట్టొద్దని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ జీవితాంతం ముఖ్యమంత్రులుగా ఉంటారని అనుకోవద్దని వారికి హితవు పలికారు. పోలీసులు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు. మనం ఉన్న చైనా, ఇరాన్, నార్త్ కొరియా వంటి నియంతృత్వ దేశాల్లో కాదని, ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నామనే విషయం మర్చిపోవద్దని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement