తొర్రూరు : సీఎం కేసీఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చింది, మహిళల సాధికారత కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ఆ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు అధ్యక్షతన మందస్తుగా ఘనంగా మహిళా దినోత్సవం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి, పురోగతి జరుగుతుంది. దేశలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం మన రాష్ట్రంలోనే జరిగింది. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన తొర్రూరుకు వస్తున్న మంత్రి, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 500 మందికి కుట్టు మిషన్లు, సర్టిఫికేట్ల పంపిణీ చేస్తామన్నారు. అలాగే తనను ఇంతగా ఆదరించి, గెలిపిస్తూ వస్తున్న, నియోజకవర్గంలో మహిళలను కాపాడుకునే బాధ్యత నాదేనని మంత్రి అన్నారు.
మహిళలకు అసలైన ఆత్మ బంధువు సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనే కాదు, అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణలో మహిళలకు స్థానిక సంస్థల్లో, మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు కల్పించారు. అనేక అవకాశాలు కల్పిస్తూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు ప్రతిగా మహిళలతో పాటు మనమంతా కేసీఆర్ కు కృతజ్ణతలు తెలుపుకోవాలే అన్నారు. 2014 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సత్కరిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా…మన రాష్ట్రంలో కుట్టు శిక్షణ చేపట్టినం అన్నారు. వీటితో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల భద్రతకు షీటీమ్స్, ఒంటరి, వృద్ధ, వితంతు, బీడి కార్మిక, బోధకాలు, నేత, గీత మహిళలకు పెన్షన్లు ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాం అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా పేద ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా మేనమామగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు.
ఏడాదికి 18,000 కోట్ల రూపాయల స్త్రీ నిధి రుణాలు అందచేస్తున్నాం అన్నారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళలకు మందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. మహిళలు చదువులతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మీద దృష్టి పెట్టాలన్నారు. మనకు సేవ చేస్తున్న సీఎం కేసీఆర్ కి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి అండగానిలవాలన్నారు.