సీఎం కేసీఆర్ ఈ నెల 12నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఉంటుంది.. అక్కడి కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి, సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేస్తారు.
కలెక్టరేట్ ఆఫీసును పరిశీలించిన ఎమ్మెల్యే వనమా, కలెక్టర్ అనుదీప్
సీఎం కేసీఆర్ ఈనెల 12న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా పాల్వంచలో ఉన్న కలెక్టర్ ఆఫీసును జిల్లా కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పరిశీలించారు. దీనికి సంబంధించి తగు సూచనలు జిల్లా అధికారులకు చేశారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ సూచనల మేరకు సీఎం పర్యటనని విజయవంతం చేయాలని చెప్పారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, విప్, జిల్లా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, జిల్లా ప్రజా ప్రతినిధులు అందరూ హాజరవుతారని, దానికి తగ్గ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఎమ్మెల్యే వనమా సూచించారు.
18 తర్వాత ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభం
ఇక.. సంక్రాంతి పండుగ అనంతరం అంటే.. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సకల సదుపాయాలతో జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. మరికొన్ని తుదిదశలో నిర్మాణ పనులు సాగుతున్నాయి.