హైదరాబాద్, ఆంధ్రప్రభబ్యూరో: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయాలను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాకు ఇటీవల ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో వైద్య కళాశాల భవన నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలు, కొట్టుకుపోయిన రహదారులు, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
తన పర్యటనలో తెరాస జిల్లా కార్యవర్గ సమావేశంలోనూ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. జిల్లాలో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ సునీతారెడ్డిని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ వర్గీయులు అడ్డుకుని ఆందోళనకు దిగిన విషయాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించి జిల్లాకు చెందిన నేతలను పిలిపించి మందలించిన సంగతి తెలిసిందే. అయినా గొడవలు సద్దుమణగకపోవడంతో వికారాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా నేతలను ఓ దగ్గర కూర్చోబెట్టి వారికి హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.