Tuesday, September 17, 2024

Big Story: మూడో వారంలో సీఎం కేసీఆర్‌ జిల్లాల టూర్‌.. పోడు భూముల పరిష్కారమే ప్రధాన ఎజెండా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాల్లో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుతో పాటు, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, నేతల మధ్య లోపించిన సమన్వయాన్ని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఈనెల మూడో వారంలో ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎంతో ఇబ్బందిగా పరిణమించిన భూ రికార్డుల వ్యవహారాన్ని సత్వరమే పరిష్కరించాలన్న పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనల్లో ఈ అంశంపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వానికి తలనొప్పిగా పోడు భూముల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి క్షేత్రస్థాయిలో ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చేయాలని ఆయన సంకల్పించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15 నుంచి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులకు సన్నాహంగా 11వ తేదీ ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర రెవెన్యూ అధికారులతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే తీసుకువచ్చిన ధరణిలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. ధరణి అమలులో కలుగుతున్న ఇబ్బందులను, ఎదురవుతున్న సమస్యలను విపక్షాలు పెద్దవిగా చేసి చూపించడం, ప్రజల్లో వ్యతిరేక భావన కల్పించేలా ప్రచారం చేస్తుండడంతో సీఎం కేసీఆర్‌ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ధరణి అమలులో క్షేత్ర స్థాయిలో వచ్చిన ఫిర్యాదులను గమనంలోకి తీసుకున్న కేసీఆర్‌ రెవెన్యూ సదస్సులను నిర్వహించి వాటి పరిష్కారానికి నడుం బిగించాలని నిర్ణయించారు.

భూ రికార్డుల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ భూముల లావాదేవీలకు అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చాక ఎన్నో సమస్యలు వెలుగు చూశాయి. గతంలో జరిగిన పొరపాట్లు, ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పిదాలు ఇతర కారణాల మూలాన భూ యజమానులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇందుకోసం ధరణి పోర్టల్‌లో కొన్ని మాడ్యూల్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూ రికార్డులను సంబంధించి నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులను నిర్వహించి ధరణి పోర్టల్‌ వల్ల రైతులు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన యజమానుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారి, తహసీల్దార్‌ ఇతర అధికారులు సమావేశమై వచ్చిన ఫిర్యాదులపై అధ్యయనం చేస్తారు. అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే వీలైతే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. లేని పక్షంలో వివరాలను ఉన్నతస్థాయి అధికారులకు పంపించి ఏ సమస్య ఎదురవుతుందో వాటిని వివరిస్తారు. ఈ దరఖాస్తు చేరిన వారం, పది రోజుల్లో పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపడతారు.

మండలం ఒక యూనిట్‌గా ..

ఒక మండలాన్ని ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలం యూనిట్‌గా బృందాలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులను స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దరఖాస్తుదారులు పడుతున్న ఇబ్బందులపై అధికారుల బృందాలు దృష్టి సారిస్తాయి.

ఈనెల 11న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. భూ రికార్డులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి, ఏ దిశగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకుంటారు. ధరణి పోర్టల్‌ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఆయన ఆలకించనున్నారు. ఈ సమావేశంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కూడా పాల్గొంటుండడంతో వారితో కూడా సీఎం కేసీఆర్‌ సమాలోచనలు జరిపే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

రెండు లేదా మూడవ వారంలో జిల్లాల పర్యటన..

ఇప్పటికే సిద్ధమైన తెరాస జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవంతో పాటు ఆ జిల్లా సమీక్షా సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ ఈనెల రెండు లేదా మూడవ వారంలో ఆయా జిల్లాల్లో పర్యటించేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనగాం, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో పర్యటించి తెరాస కార్యాలయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మిగతా జిల్లాలకు వెళ్లి సిద్ధంగా ఉన్న పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యాక జిల్లా పర్యటనల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనల్లో భాగంగా ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలపై దృష్టి సారిస్తారు. అవసరమైతే నేతలతో ముఖాముఖి సమావేశమై వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, తాండూరు, మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌, కల్వకుర్తి, నల్గొండ జిల్లా నకిరేకల్‌, ఖమ్మం జిల్లాలలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆయా నేతలను హైదరాబాద్‌కు రప్పించి వారితో సమావేశం కావాలని నిర్ణయించారు. ఎలాగూ జిల్లా పర్యటనలకు వెళుతున్నందున ఆయా జిల్లాల్లో ఉన్న నేతలతో సమావేశమై వారి మధ్య సమన్వయం కుదుర్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై కూడా ఆయన చర్చించనున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి వచ్చే ఏడాదిలో పార్టీపరంగా చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement