రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధి విధానాలు సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (మంగళవారం) ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కోసం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అధ్యక్షతన ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
ఆరు రోజుల దిల్లీ పర్యటనను ముగించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే (ఆదివారం) హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎం.. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయి రాజకీయాంశాలపై చర్చించారు. రైతు సంఘాల నేతలు, ఆర్థిక నిపుణులతో పాటు ప్రముఖ జర్నలిస్టులతోనూ ఆయన భేటీ అయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.