రాష్ట్రంలో పురోగతిలో ఉన్న పోలీస్ కమిషనరేట్లు, ఎస్‌పీ ఆఫీస్‌ల నూతన భవనాల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పురోగతిలో ఉన్నకమిషనరేట్‌లు , ఎస్.పి కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల భవనాల నిర్మాణ పురోగతిపై డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎం.డి. సంజయ్ కుమార్ జైలతో కలసి కమిషనర్లు, ఎస్‌పీలు, ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు పూర్తయిన రామగుండం పోలీస్ కమిషనరేటు, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల పోలీస్ కార్యాలయాలను త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలియ చేశారు.
వివిధ స్థాయిల్లో ఉన్న మిగిలిన పోలీస్ భవనాల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అధికారులను కోరారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఎస్పీ కార్యాలయాలు, రెండు సిపి కార్యాలయాల నిర్మాణం వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉందని ఎస్.కె. జైన్ తెలిపారు. పురోగతిలో ఉన్న కార్యాలయ భవనాలన్నింటినీ నియమిత కాలంలో సంబంధిత శాఖల సమన్వయంతో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.