సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ పురస్కారాలు అందుకున్న కలెక్టర్లు, అధికారులను మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే.. గల్లీ బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి షెకావత్ మిషన్ భగీరథను అభినందించారని చెప్పారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు రావడం గర్వకారణమని వెల్లడించారు. అందరి కృషితోనే మిషన్ భగీరథ విజయవంతమైందని తెలిపారు. పల్లె ప్రగతి పనుల వల్లే 14 కేంద్ర అవార్డులు వచ్చాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడకముందు తాగునీటి కోసం మహిళలు ఎన్నో కష్టాలు పడేవారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.