దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇవేం సాధించలేవని, ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా అని చెప్పారు. ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలని పేర్కొన్నారు. ఆ సిద్ధాంతానికి ప్రతిపాదిక పడాలని స్పష్టం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జరగాలన్న కేసీఆర్… భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటదన్నారు. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండాకు శ్రీకారం చుడుదామన్నారు. దేశం బాగుపడటానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం అని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, గతిని, స్థితిని మార్చడానికి, దేశాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా, ప్రతిపాదన, సిద్ధాంతం తయారై దేశం నలుమూలల వ్యాపిస్తే ఈ దేశానికే గర్వకారణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు.. కూటమి కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలన్నారు.
‘’2000లో తాను తెలంగాణ అని మాట్లాడితే.. ఏం పని లేదా అని కొందరు అన్నారు. సంకల్పంతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆ భగవంతుడికి దండం పెట్టి బయలుదేరి తెలంగాణ సాధించాం.’’ అని అన్నారు. అంతేకాదు.. సాధించిన తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా చేశామన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు పోయేవారని, ఇవాళ వలసలు రివర్స్ వచ్చాయి అని అన్నారు. 11 రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారని చెప్పారు. బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్ మిల్లులు నడవవు అని పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భవన నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో పని పుష్కలంగా దొరుకుతోందన్నారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.