Thursday, November 21, 2024

కర్నాటక, మహారాష్ట్రల పర్యటనకు సీఎం కేసీఆర్‌.. 26న‌ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ స్థాయి పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురువారం కర్నాటక రాష్ట్రానికి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్త్తున్న కేసీఆర్‌ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో సమావేశమవుతారు. ఇప్పటికే ఓ దఫా దేవెగౌడ, కుమార స్వామిని కలిసి జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపిన కేసీఆర్‌ మరోమారు వెళుతుండడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా గత వారం ఢిల్లి వెళ్లి నాలుగు రోజులపాటు అక్కడే బస చేసి రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈనెల 20న ఢిల్లి వెళ్లిన కేసీఆర్‌ ఆ రోజు ఢిల్లిలోని పలువురు ఆర్థిక, సామాజిక, వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఢిల్లి, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ సింగ్‌తో సహా ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలు, త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక, ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తదితర అంశాలపై చర్చించినట్టు ప్రచారం జరిగింది.

ఢిల్లి ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను సందర్శించి కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కూడా బస్తీ దవాఖానాల పేరుతో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తోందని ఢిల్లి తరహాలోనే తెలంగాణలోనూ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడీ లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేశామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు ఢిల్లిdలోనే ఉండి వివిధ రంగాల్లో ప్రముఖులను కలిసి అనేక అంశాలపై చర్చించిన కేసీఆర్‌ పంజాబ్‌ రాష్ట్రం చండీగఢ్‌ వెళ్లి రైతు ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించి వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు. మొత్తం 600 రైతు కుటుంబాలను సీఎం పరామర్శించారు. ఆర్థిక సాయం కార్యక్రమంలో అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సింగ్‌, జాతీయ స్థాయిలో పోరాడిన రైతు ఉద్యమ నేతలు పాల్గొన్నారు. పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లి రాష్ట్రాలకు చెందిన రైతు కుటుంబాలకు చెక్కులను అందజేశారు.

ఢిల్లి పర్యటన సందర్భంగా అఖిలేష్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ సింగ్‌తో పాటు ఆయా రంగాల ప్రముఖులను కలిసి చర్చించిన అంశాలను బెంగళూరు పర్యటనలో దేవెగౌడ, కుమార స్వామిలను కలిసి వివరించనున్నట్టు తెలుస్తోంది. బాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో బలమైన కూటమి ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైందని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కూటమి బలోపేతమై ఎన్నికల్లో ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలను కేసీఆర్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్నదని కాంగ్రెస్‌, బాజపాలకు ధీటుగా అన్ని ప్రాంతీయ పార్టీలు, కూటములను ఒక తాటిపైకి తెచ్చి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్న నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చినట్టు సమాచారం. ప్రజాబలం, అన్ని రాష్ట్రాలు ఆదరించే ప్రముఖుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావిస్తున్న కేసీఆర్‌ ఇందుకు అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అఖిలేష్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇందుకు సమ్మతి తెలిపారని మిగిలిన పార్టీలను సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని దేవెగౌడ, కుమారస్వామి వద్ద సీఎం కేసీఆర్‌ వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే తాను ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆ తర్వాత జార్ఖండ్‌ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ను కలిశానని జాతీయ రాజకీయాలపై వారు కూడా మక్కువతో ఉన్న విషయాన్ని కేసీఆర్‌ దేవెగౌడ, కుమార స్వామిలకు వివరించనున్నట్టు తెలుస్తోంది. గురువారం రోజంతా బెంగళూరులోనే ఉండే కేసీఆర్‌ మరుసటి రోజు శుక్రవారం రాలేగావ్‌ సిద్ధి పర్యటన చేపట్టనున్నారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సమావేశమై గ్రామాల అభివృద్ధికి జరుగుతున్న కార్యాచరణను అడిగి తెలుసుకుంటారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై వివరిస్తారు. మధ్యాహ్నం దాకా రాలేగావ్‌సిద్ధిలోనే ఉండే కేసీఆర్‌ అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడి సాయిబాబా చెంతకు వెళ్లి ఆయనను కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని ఇది వరకు ఖరారు చేసిన పర్యటనను బట్టి తెలుస్తోంది.

29 లేదా 30న పశ్చిమ బంగా, బీహార్‌లకు…

- Advertisement -

ఉత్తరాది, దక్షిణాదిలోని కర్నాటక రాష్ట్రాల పర్యటనను ముగించిన కేసీఆర్‌ ఈనెల 29 లేదా 30 తేదీల్లో పశ్చిమ బంగా, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశముంది. కోల్‌కతా వెళ్లనున్న కేసీఆర్‌ పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా ఆమె మంత్రివర్గ సహచరులను కలవనున్నట్లు తెలుస్తోంది. మమతతో జరిగే భేటీలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నిక, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ఫలితాలు, జాతీయ స్థాయిలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై చర్చించే అవకాశముంది. గాల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా సైనిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. అక్కడి నుంచి పాట్నా చేరుకుని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌తో విడివిడిగా సమావేశమవుతారు. ఇప్పటికే ఓమారు తేజస్వి యాదవ్‌ పార్టీ సీనియర్లతో కలిసి హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ కలిశారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement