Friday, November 22, 2024

హస్తిన చేరుకున్న సీఎం కేసీఆర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హస్తిన చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల పై పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. జాతీయ రాజకీయాలపై ఆయన ఆయా పార్టీల నేతలతో సీఎం కేసీఆర్‌ సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది. మూడు రోజులపాటు ఢిల్లిలో ఉండే సీఎం కేసీఆర్‌ ఢిల్లి, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌తోపాటు జాతీయ రైతు సంఘం నాయకులతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, జీ.రంజిత్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌ కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 11 లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోవడంతోపాటు పంచాయతీ, రోడ్లు భవనాల శాఖకు చెందిన రహదారులు, కల్వర్టులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఇటీవల మూడు రోజులపాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించి వెళ్లింది. తాత్కాలికంగా రూ.1000 కోట్ల ఆర్థికసాయం చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖ రాశారు. వరదల సమయంలో వందలకుపైగా గ్రామాలు నీట మునిగాయని, ఎంతోమంది నిరాశ్రయులయ్యారని, వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని కేసీఆర్‌ కేంద్ర మంత్రులను కలిసి కోరనున్నట్లు సమాచారం.

పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచడం వల్ల భద్రాచలంలోని అనేక గ్రామాలు నీట మునిగాయని, రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించి ఆ మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేలా చూడాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణలో ఉన్న సీలేరు విద్యుత్‌ కేంద్రాన్ని కూడా ఏపీకి అప్పగించారని, ఈ అంశంపై కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన కోరనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆ శాఖకు చెందిన కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. 2014 నుంచి 2017 వరకు ఉపాధిహామీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అత్యుత్తమంగా నిర్వహించిందని, గ్రామీణ పేదలకు జీవనోనాధి కల్పించిందని వివరించనున్నారు. ధాన్యం సేకరణ విషయంలో నెలకొన్న సమస్యలను తీర్చాలని, కేంద్రంతో జరిగిన ఒప్పందం ప్రకారం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను సేకరించాలని కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రం తీసుకునే రుణాలకు అనుమతులు ఇవ్వాలని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచాలని, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, గ్రాంట్లను పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి అభ్యర్ధించనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి రావాల్సిన రూ.33, 818, 30 కోట్లు విడుదల చేయాలని ఆమెను కలిసి కోరనున్నట్లు సమాచారం.

నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన మిషన్‌ భగీరథ గ్రాంట్‌ రూ.19205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు, సీఎస్‌ ఎస్‌ నిధులు రూ.495.20 కోట్లు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.682.50 కోట్లు, పున ర్విభజన చట్టం కింద ఉన్న పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరనున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎన్‌టీపీసీ ద్వారా రాష్ట్రానికి 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఐసీఎస్‌ఆర్‌ సంస్థల ఏర్పాటు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, కృష్ణా నదీ జలాల పరిష్కారం, జీఎస్‌టీ సంబంధించిన సంస్థలపై ఆయాశాఖల మంత్రులు, అధికారులతో కలిసి చర్చించ నున్నారు. కంటోన్మెంట్‌ రహదారుల సమస్య, ఆదిలాబాద్‌లో సీసీఐ పరిశ్రమ పునరుద్దరణ , గిరిజన సంక్షేమ ఉపకార వేతనాలు విడుదల , ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, రీజినల్‌ రింగు రోడ్డు నోటిఫికేషన్‌ జారీకి సంబంధించిన అంశాలను కూడా ఈ భేటీలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

నూతన రాష్ట్రపతిని కలవనున్న కేసీఆర్‌…

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదిముర్ము సోమవారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమెను మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌, ఎంపీలు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిని కలిసేందుకు ఎంపీలు ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖ రాసినట్లు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని పోరాటానికి సిద్ధమైన సీఎం కేసీఆర్‌ కలిసివచ్చే పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై కూడా హస్తిన పర్యటనలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల నుంచి బరిలో నిలిచిన యశ్వంత్‌సిన్హాకు బహిరంగ మద్దతును ప్రకటించడంతోపాటు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించిన రోజే యశ్వంత్‌ సిన్హాను పిలిపించి ఆయనతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ గవర్నర్‌ మార్గరేట్‌ అల్వాకు మద్దతు ఇస్తారా..? లేక ఎన్‌డీఏ తరుపున పోటీకి దిగిన పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ దన్కర్‌వైపు మెగ్గు చూపుతారా..? అన్నది తేలాల్సి ఉంది. కాగా సీఎం కేసీఆర్‌ ఢిల్లి పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని తెరాస ఎంపీలు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement