ఆంధ్రప్రభ, హైదరాబాద్ : సమిష్టి ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని వీడి త్యాగాలకు సిద్దపడినప్పుడే సమాజ హితం సాధ్యామవుతుందని, త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్ధకత అనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వ మానవాళికి అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బక్రీద్(ఈదుల్ అజ్ హా) పర్వదినం పురస్కరించుకొని ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తున్నదని అన్నారు.
సకల మత విశ్వాసాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి జీవించేలా గంగా, జమునా తహజీబ్‌ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామన్నారు. దేశానికే ఆదర్శవంతమైన లౌకిక ఆధ్యాత్మిక కార్యాచరణ రాష్ట్రంలో అమలవుతుందని తెలిపారు. ఇస్లాం సహా మైనార్టీ మతస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.