ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ (74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇవ్వాల (ఆదివారం) కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో దళిత కుటుంబంలోని లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి పాడిన ‘‘అమ్మా తెలంగాణమా’’, ‘‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’’ పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్ 6వ తేదీన టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినిమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయితే.. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. అయినప్పటికి ప్రజా సమస్యలపై చివరి దాకా పోరాడారు. గద్దర్ మృతిపై పలువురు రాజకీయ, సాహితీ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన లోటు సాహితీ రంగానికి తీరనిదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సంతాపం తెలిపారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. సినీ నటుడు చిరంజీవితో పాటు పలువురు సంతాపం తెలిపారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన పాటలతో ప్రజల్లో సజీవంగా ఉంటారని, ఆయన గొంతు వినిపిస్తూనే ఉంటుందన్నారు చిరంజీవి.