కరోనా వ్యాప్తి, లాక్డౌన్ ఎత్తివేతపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుందన్నారు. ఈ మధ్య కాలంలో రాదన్నారు. వరంగల్లో కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పేదలు ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ ఎత్తేశామన్నారు. సగం జిల్లాల్లో నో కరోనా అన్నారు. వైద్యాధికారులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సడలింపులు పెట్టినా వ్యాప్తి లేదని… ఇదే విషయాన్ని అధికారులు చెప్పారన్నారు. అవన్నీ చర్చించిన తర్వాతే లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ అన్నారు. అయినా విమర్శలు చేశారన్నారు. వాళ్లకే పట్టింపు ఉన్నట్టు … తమకు లేనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విమర్శలు చేసే వారి విజ్ఞానానికే వదిలేస్తున్నామన్నారు.
మరోవైపు తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాలను బాగు చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలను మరింత బాగు చేసుకునేందుకు జులై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పది రోజుల పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం చేపడుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నెల 26వ తేదీన మినిస్టర్లు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ రోజు మొత్తం ఎజెండా ఫైనల్ చేద్దామన్నారు.
ప్రతి గ్రామానికి నర్సరీ ఉంది. ట్రాక్టర్లు వచ్చాయి. మున్సిపాలిటీల్లో అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదు. రాజకీయాల్లో నేల విడిచి సాము చేయడం జరుగుతుంది. గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెలిగిపోవాలి. ఇవి సాధిస్తే.. దానికి మించిన పని లేదు. ప్రతీ గ్రామం అభివృద్ధి చెందుతోంది. ప్రజలకు అవసరమైన సదుపాయాలన్నింటినీ కల్పిస్తున్నాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.