న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయ సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, గొడ్డేటి మాధవి, చింతా అనురాధ, తలారి రంగయ్య, రెడ్డప్ప, మాధవ్, గురుమూర్తి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్యతో పాటు ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వెట్టర్లు, దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ భవన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా స్వెట్టర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ విజయ సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… భారత రాజకీయల్లో వైఎస్ జగన్‌ది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ప్రతిపక్షాలు వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ప్రజల సంక్షేమం కోసం నిబద్దతతో పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 2009లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైందన్న విజయసాయి, వైఎస్ జగన్ వ్యక్తిత్వంతో పార్టీ నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబంతో తనది మూడు తరాల అనుబంధమని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వందేళ్లు చల్లగా జీవించాలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని ఆకాంక్షించారు.