Tuesday, November 26, 2024

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్.. ప్రధాని, నిర్మలా సీతారామన్‌, గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటు కీలకం కానుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యి ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధానమంత్రితో, ఐదున్నర గంటల సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో, రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనులు కేటాయింపు, మెడికల్‌ కాలేజీలు తదితర అంశాలపై సీఎం వారితో చర్చించారు. ప్రధానితో 45 నిమిషాల సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల మీదే చర్చ జరిగినట్టు సమాచారం. ఎన్డీఏ కూటమికి పోటీగా ప్రతిపక్షాలు గనుక ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపితే రాష్ట్రపతి ఎన్నికల పోటీ రసవత్తరంగా మారుతుంది. ఎన్డీఏ కూటమికి తగినంత సంఖ్యా బలం లేనందున ఇతర తటస్థ పార్టీలైన బీజేడీ, వైఎస్సార్సీపీ సహా ఇతర పార్టీల మద్దతుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తమ మద్దతు ప్రకటించినా ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి కావడం ఖాయం. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధానితో భేటీ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించేనని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతివ్వడంపై సీఎం జగన్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బరిలోకి దింపే అభ్యర్థిని బట్టి తమ మద్దతు ఉంటుందని జగన్ ప్రధానికి తేల్చి చెప్పినట్టు సమాచారం.

ప్రధానితో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2014–15కు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పెన్షన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్‌ కింద రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉందని వివరించిన జగన్, ఈ అంశంపై వెంటనే దృష్టి సారించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలను చెల్లించాల్సి ఉందని, రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయని, ఈవ్యవహారాన్ని వెంటనే సెటిల్‌ చేయాల్సిందిగా కోరారు.

మేం తీసుకునేది రుణాలే-గ్రాంట్లు కావు

2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారని, గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారని జగన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావని వివరించారు. కోవిడ్‌ వంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాలని, ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని, గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా విడివిడిగా కాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రీఎంబర్స్‌ చేయాలని అన్నారు. ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ.905.51 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని చెప్పుకొచ్చారు. ప్రాజెక్ టుకోసం చేసిన ఖర్చును 15 రోజుల్లోగా చెల్లించేలా చూడాలని ప్రధానిని కోరారు. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని డీబీటీ పద్ధతిలో చేయాలని, దీనివల్ల చాలావరకు జాప్యాన్ని నివారించవచ్చంటూ జగన్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగడానికి వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదటి స్పెల్‌లో నిధులు అడ్వాన్స్‌గా ఇస్తే, వీటికి సంబంధించి 80శాతం పనులు పూర్తైన తర్వాత రెండో స్పెల్‌లో మిగిలిన నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలని జగన్ సూచించారు. కేంద్ర రాష్ట్రానికి చెందిన సంబంధిత శాఖల అధికారులతో నీతిఆయోగ్‌ సమావేశమై, ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న బియ్యం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తించిందని, దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని చెప్పారు. జాతీయ ఆహారభద్రతా చట్టం కింద ఇస్తున్న బియ్యంలో దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉందని, ఇందులో రాష్ట్రానికి కేటాయింపులు చేస్తే సరిపోతుందంటూ నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని తెలిపారు. నెలకు 0.77లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలంటూ నీతిఆయోగ్‌ సిఫార్సును ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కూడా తక్కువ కేటాయింపులు ఉన్నాయని, దాదాపు 56 లక్షల కుటుంబాలు కవర్‌ కావడంలేదని, వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్రం భరిస్తోందంటూ వివరించారు.

- Advertisement -

మరిన్ని ఆసుపత్రులకు అనుమతివ్వండి

రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 26కు చేరిందని జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా, కొత్తగా మరో 3 మెడికల్‌ కాలేజీలకే కేంద్రం అనుమతినిచ్చిందని వెల్లడించారు. మొత్తంగా 26 జిల్లాలకు 14 మెడికల్‌ కాలేజీలు అవుతున్నాయని, రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలంటే.. మెడికల్‌ కాలేజీలు చాలా అవసరముందని అభిప్రాయపడ్డారు. మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని ఆయన ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టుకు గతంలో ఇచ్చిన క్లియరెన్స్‌ గడువు ముగిసిందని, తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. ఈమేరకు పౌరవిమానయానశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు.

పెట్టుబడుల ఆకర్షించేందుకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారని, వాణిజ్యపరంగా ఈ ప్లాంట్‌ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్‌ ఓర్‌ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని అడిగారు. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్‌ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రధానికి తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేస్తోందని, ఈరంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని చెప్పారు. 16 చోట్ల బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రతిపాదనలు అందించామని, 14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయని, ఏపీఎండీసీకి వీటిని కేటాయించాల్సిందిగా వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలకు సంబంధించి నిర్మలా సీతారామన్‌తో సీఎం చర్చించారు. విభజన చట్టంలోని హామీల అమలు, నిధుల విడుదలకు సంబంధించి ఆమెకు వినతి పత్రం సమర్పించారు.

గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ పోలవరం, ఇతర నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై జగన్ చర్చలు జరిపారు. అనుమతులు, నిధుల విడుదలపై వినతిపత్రం అందజేశారు. శుక్రవారం ఉదయం సీఎం జగన్ హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన విజయవాడ తిరిగి వెళ్లనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement