ఏపీ సీఎం వైయస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో సీఎం పోలవరానికి బయలుదేరతారు. 11 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ప్రాజెక్టు ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తారు. నిర్వాసితులకు అందించాల్సిన సహాయక చర్యలు, పరిహారంపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
కాగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 14న.. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటన వాయిదా పడింది.