Tuesday, November 26, 2024

ప్రజల్లోకి సీఎం జగన్‌.. ప్లీనరీయే అజెండా ఏడాది వరకు అదే జోష్‌..!

అమరావతి, ఆంధ్రప్రభ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీయే అజెండాగా ముందస్తు వ్యూహానికి సిద్ధమవుతోంది.. వచ్చేనెల 8, 9 తేదీల్లో ఇడుపులపాయలో జరిగే ప్లీనరీలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.. ఏడాదంతా ఇదే జోష్‌ నింపాలని భావిస్తున్నారు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణ.. ఏడాదంతా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు ధీటుగా వచ్చే ఏడాదంతా ప్లీనరీలో తీసుకున్న విధి విధానాలను అమలు చేయాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సంకేతాలు అందాయి. మహానాడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల్ని అధికార పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు వైసీపీ పనైపోయిందని చేస్తున్న ప్రచారాన్ని కూడా సీఎం జగన్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలియవచ్చింది..

పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల వరకు పాత మంత్రి వర్గంలో జగన్‌పై ఈగ వాలనివ్వకుండా ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.. ప్రత్యర్థి పార్టీలు గుక్కతిప్పుకోలేని పరిస్థితులు కల్పించారు.. మరోవైపు గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల ఆరోపణలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి.. జనసేన తరుపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేతో పాటు టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ దిశగా అడుగులు వేశారు. అయితే గత మూడు నెలలుగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో స్తబ్దతు నెలకొందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.. ప్రస్తుతం ఆ దిశగా ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవటంలో మంత్రులు ఒకింత విఫలమవుతున్నారని పార్టీ భావిస్తోంది.. ఈ నేపథ్యంలో మంత్రులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులకు బుధవారం నిర్వహించే వర్క్‌ షాప్‌లో ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement