Monday, November 25, 2024

టీచర్ల స్పౌజ్‌ బదిలీలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌!

స్పౌజ్‌ బదిలీలకు అవకాశం కల్పించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన బాట చేపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతుల కలసాకరం కానుంది. టీచర్ల విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీచర్ల అప్పీల్స్‌, స్పౌజ్‌ దరఖాస్తులు, పరస్పర బదిలీలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా విద్యా వర్గాల ద్వారా తెలిసింది. 317 జీవో ప్రకారం రాష్ట్రంలో నూతన జిల్లాలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ దాదాపు రెండు నెలలుగా కొనసాగుతోంది. అయితే 19 జిల్లాల్లో కౌన్సెలింగ్‌ను చేపట్టి జిల్లాలకు టీచర్లను కేటాయించడంతో పాటు, పాఠశాలలకు సైతం ఉపాధ్యాయులను కేటాయించారు. చాలా మంది జాయిన్‌ కూడా అయ్యారు కూడా. అయితే జిల్లాలకు ఉపాధ్యాయుల విభజనలో భాగంగా భర్త ఒక జిల్లాకు, భార్య మరోక జిల్లాకు బదిలీ కావడంతో గత కొన్ని రోజులుగా టీచర్లు ఆందోళన బాట పట్టారు. తమను విడగొట్టొద్దని, భార్యాభర్తలకు ఒకే జిల్లాకు బదిలీ చేయాలని జిల్లా కేంద్రాల్లో, పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ముందు ధర్నాలు, ప్రగతి భవన్‌ ముట్టడి లాంటి కార్యక్రమాలను టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు చేపడుతూ వచ్చారు. అంతే కాకుండా మంత్రులకు వినతిపత్రాలు సమర్పించడం లాంటి కార్యక్రమాలను సైతం గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయులు చేపడుతున్నారు. రాజీకీయ పార్టీలు కూడా 317 జీవోను రద్దు చేయాలనే డిమాండ్‌ రావడంతో ఎట్టకేలకు ఉపాధ్యాయుల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం స్పౌజ్‌ బదిలీలు, పరస్పర బదిలీలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే 13 జిల్లాలను యధావిథిగా బ్లాక్‌ లిస్టులో పెట్టి మిగిలిన 19 జిల్లాలకు బదిలీల అవకాశం కల్పించినట్లుగా తెలిసింది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాకు భర్త బదిలీ అయి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు భార్య బదిలీ అయితే భార్య బదిలీ అయిన మహబూబ్‌ నగర్‌ జిల్లాకే భర్త ఆప్షన్‌ ఇచ్చుకొని బదిలీ కావల్సి ఉంటుంది. బ్యాన్‌ లిస్టులో ఉన్న రంగారెడ్డి జిల్లాలకు భార్యకు అవకాశం కల్పిం చరు. బ్యాన్‌ చేసిన జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలు చేపట్టకుండా కౌన్సెలింగ్‌ పూర్తయిన 19 జిల్లాలకు మాత్రమే అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లకు కొంత ఉపశమనం కల్గించినట్లేనని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన పీఆర్టీయుటీఎస్‌ నేతలు..
స్పౌజ్‌ బదిలీలు, పరస్పర బదిలీలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం పట్ల పీఆర్టీయుటిఎస్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ఉపాధ్యాయుల పక్షాన పీఆర్‌టీయు టీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌ రావు ఈమేరకు కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement