Monday, November 25, 2024

Follow up | ప్రారంభమైన సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీలు.. ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పండుగ వాతావరణంలో పట్టణాల ప్రజలు కదలిరాగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్‌ 2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లాకలెక్టర్లు, అడిషనల్‌ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకుని 33 జిల్లాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పోటీల్లో సోమవారం 80 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మూడురోజులపాటు జరిగే ఈ క్రీడోత్సవాల్లో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా విజేతలు అవార్డులు అందుకోనున్నారు. సోమవారం ఈ పోటీల్లో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, జిల్లాపరిషత్‌ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని డ్రాాకారులను ప్రోత్సహించారు. హైదరాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌ లో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సీఎం కప్‌ జిల్లాస్థాయి పోటీలను ప్రారంభించారు.

నిర్మల్‌ లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, నల్గొండలో మంత్రి జగదీష్‌ రెడ్డి, వరంగల్‌, హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, భవనగిరిలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, నిజమాబాద్‌ లో వేముల ప్రశాంత్‌ రెడ్డి, కరీంనగర్‌ లో మంత్రి గంగుల కమలాకర్‌, వనపర్తి లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ అలాగే మంత్రులు అందుబాటులో లేని మిగతా జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. అయితే ముందుగా ప్రకటించినట్లుగా కార్యక్రమాల ఒత్తిడితో నిజామాబాద్‌ లో ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, స్వల్ప అనారోగ్య సమస్యతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్రీడా పోటీల ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేదు.

- Advertisement -

అయితే మరోరోజు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రీడాశాఖ అధికారులు చెప్పారు. ఏటూరి నాగారంలో గిరిజన క్రీడాకారులు ఉత్సాహంతో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఏటూరినాగారంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌, జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య తో కలిసి సీఎం కప్‌ క్రీడాపోటీలను క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ క్రీడలను ప్రేమిస్తే ఆరోగ్యం అహ్లాదకరంగా ఉంటుందని చెప్పారు, సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారికి ఉన్నత అవకాశాలనుకల్పించేందుకు సీఎం క్రీడా కప్‌ 2023 ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో 17వేల క్రీడా మైదానాల నిర్మాణం, క్రీడలకు ప్రోత్సాహం, క్రీడా కారుల ప్రొఫెషనల్‌ కోర్సుల్లో 0.5 శాతం ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లను సీఎం కేసీఆర్‌ కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రగతి దేశానికి ఆదర్శనీయంగా నిలిచిందని చెెప్పారు. మిషన్‌ కాకతీయతో గ్రామీణా అభివృద్ధి వేగవంతమైందన్నారు. ఏటూరినాగారంలో రైతులు, గిరిజన క్రీడా కారులు కూడా పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement