సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నానక్ రాంగూడ షెరటన్ హోటల్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని సీఎం రేవంత్ రెడ్డి తన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనంపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్‌ఎస్ డిపాజిట్ కోల్పోయిందని.. హరీష్ రావు, కేటీఆర్ నియోజక వర్గాల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. మేము ప్రచారం చేయకపోయినా 2018లో మాకు మూడు పార్లమెంట్ సీట్లు వచ్చాయి..మేము కనీసం ప్రచారం కూడా చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.