Saturday, November 23, 2024

Delhi | హస్తిన గగనతలంపై మేఘ మథనం.. వాయు కాలుష్యానికి చరమగీతం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తీవ్ర వాయుకాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని నగరాన్ని కాలుష్యం కోరల నుంచి బయటపడేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే వాహనాలు, ఫ్యాక్టరీలు, భవన నిర్మాణ పనులపై ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నవంబర్ 13 నుంచి ‘ఆడ్-ఈవెన్’ విధానాన్ని కూడా అమలు చేయనుంది. దీంతో పాటు నీటి ట్యాంకర్లతో నగరంలోని చెట్లపై నీటిని చిమ్మడం, స్మాగ్ గన్స్ ఉపయోగించి నీటి తుంపర్లను వెదజల్లి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.

అయినప్పటికీ కాలుష్యం స్థాయులు తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్థానిక పరిస్థితుల కంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంటవ్యర్థాలను తగులబెట్టడమే ఇందుకు కారణమని, రైతులకు ప్రత్యామ్నాయ విధానాలు సూచించి, వాటిని అనుసరించేలా ప్రోత్సహించాలని సర్వోన్నత న్యాయస్థానం సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది రోజుల వ్యవధిలో అమలు చేసే అవకాశం లేనందున ఈ సీజన్లో ఢిల్లీ ప్రజలకు వాయు కాలుష్యం నుంచి ఉపశమనం కల్గించేందుకు ఉన్న మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

- Advertisement -

ఆ క్రమంలో కృత్రిమంగా వర్షాలు కురిపించి కాలుష్యం స్థాయులను తగ్గించాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), కాన్పూర్‌తో కలిసి కసరత్తు చేస్తోంది. క్లౌడ్ సీడింగ్ విధానంతో కృత్రిమంగా వర్షాలు కురిపించాలని ఐఐటీ-కాన్పూరు నిపుణులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా వారితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపగా, ఈ నెల 20, 21 తేదీలు క్లౌడ్ సీడింగ్‌కు అనువుగా ఉంటాయని నిపుణులు సూచించారు.

వర్షంతో తగ్గనున్న వాయుకాలుష్యం

వాతావరణంలో కలిసిపోయిన సూక్ష్మాతి సూక్ష కాలుష్య రేణువులు వర్షపు నీటి బిందువులకు అతుక్కుని భూమ్మీదకు చేరుకోవడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. శీతాకాలంలో స్తబ్దుగా మారిన వాతావరణానికి తోడు పొగమంచు తోడవడం వల్ల భూమ్మీద నుంచి వెలువడే వాయుకాలుష్య ఉద్గారాలు ఉపరితలంలోకి వెళ్లకుండా అక్కడే నిలిచిపోతున్నాయి. దీనికి తోడు పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ‘ఖరీఫ్’ సీజన్ ముగించి ‘రబీ’ సాగు కోసం భూమిని సిద్ధం చేయడం కోసం పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు.

ఈ పొగ అంతా ఉత్తరాదిన పరచుకుని నిలిచిపోతోంది. దాంతో ఢిల్లీ వంటి ఉత్తరాది నగరాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. శీతాకాలంలో ఎప్పుడైనా వర్షం కురిస్తే అప్పటి వరకు ఉన్న వాయుకాలుష్యం ఒక్కసారిగా తగ్గి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మెరుగుపడుతుంది. కానీ శీతాకాలంలో వర్షాలు చాలా అరుదుగా పడతాయి. అందుకే కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ-కాన్పూర్ నిపుణలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కృత్రిమ వర్షం కురిపించాలంటే పౌడర్ రూపంలో ఉన్న ‘సిల్వర్ అయోడైడ్‌’ను విమానం సహాయంతో ఆకాశంలో స్ప్రే చేయాలి. అది మేఘాలకు తగిలి అందులో ఉన్న తేమను నీటి బిందువులుగా మార్చేస్తుంది. తద్వారా కృత్రిమ వర్షం కురుస్తుంది. ఈ ప్రక్రియనే ‘క్లౌడ్ సీడింగ్’  అంటారు. అయితే ఇది కూడా ఎప్పుడంటే అప్పుడు చేపట్టడం కుదరదు. క్లౌడ్ సీడింగ్ చేయాలంటే వాతావరణంలో కనీసం 40 శాతం మేఘాలుండాలి.

అలాగే ఆ మేఘాల్లో ఎంతో కొంత తేమ కూడా ఉండాలి. అప్పుడు కృత్రిమ వర్షం సాధ్యపడుతుంది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో కృత్రిమ వర్షం కురిపించడం కష్టమని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… శీతాకాలంలో చలితో కూడిన పొడి వాతావరణం ఉంటుంది. గతంలో 2018లో ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేసినప్పటికీ.. వాతావరణం సహకరించకపోవడంతో ప్రయోగం సాధ్యపడలేదు.

కానీ ఈసారి నవంబర్ 20 లేదా 21 తేదీల్లో క్లౌడ్ సీడింగ్ జరిపేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఐఐటీ-కాన్పూర్‌ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక శాఖ మంత్రి అతీషి ఐఐటీ-కాన్పూర్ నిపుణులతో పలు దఫాలుగా చర్చించి ఈ తేదీలను ఖరారు చేశారు. నవంబర్ 20-21 తేదీల్లో ఢిల్లీలో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అంచనాలున్నాయి.

వాతావరణంలోనూ కొంత మేర తేమ శాతం ఉంటుందని, అందుకే ఆ రెండు రోజుల్లో ఢిల్లీ గగనతలంపై క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా కృత్రిమ వర్షం కురిపించవచ్చని భావిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ వనరులను ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement