దాదాపు మూడు వారాల పాటు జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024 నేటితో (ఆగస్టు 11) ముగియనుంది. ఈ ప్రపంచ పోటీల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను కొల్లగొట్టారు. 2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈసారి ఆరు పతకాలు దక్కించుకుంది.
కాగా, సీన్ నదిపై జరిగిన ప్రారంభోత్సవ వేడుకలా కాకుండా, ముగింపు వేడుక సంప్రదాయ శైలిలో నిర్వహించనున్నారు. ఇక ముగింపు వేడుకల్లో ఒలింపిక్ పతక విజేతలు పీఆర్ శ్రీజేష్, మను భాకర్ భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగనున్న పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకలు పారిస్ స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 11న రాత్రి 9:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. కాగా, భారత కాలమానం ప్రకారం (ఆగస్టు 12) ఉదయం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. పారిస్ 2024 ఒలింపిక్స్ ముగింపు వేడుకను Sports18 1 SD, Sports18 1 HD TV ఛానెల్‌తో పాటు Jio సినిమాల్లో లైవ్ టెలీకాస్ట్ చూడవచ్చు.
విశ్వ క్రీడల్లో అగ్రరాజ్యానికే అగ్రస్థానం
ఇకపోతే పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా ఆఖరి పతకం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ఈ క్రీడల్లో చైనా, అమెరికా పోటాపోటీగా పతకాలు సాధించాయి. 40 స్వర్ణాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చైనాకు షాకిస్తూ అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. దీంతో చైనా రెండో స్థానంలో నిలిచింది.
ఇక జపాన్, ఆస్ట్రేలియా, ఆతిథ్య ఫ్రాన్స్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాలను దక్కించుకున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి ఆరు పతకాలకే పరిమితమైన భారత్ 71వ ర్యాంక్‌లో నిలిచింది.