న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నదుల ప్రక్షాళన ఒక నిరంతర ప్రక్రియ అని, నీటి వనరులు రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదుల్లోకి మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కలపకుండా ట్రీట్మెంట్లు ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాలదేనని తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస రెడ్డి (బీఆర్ఎస్) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాల ప్రయత్నాలకు కేంద్రం ఆర్థికంగా, సాంకేతికంగా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని మూసీ, గోదావరి సహా గుర్తించిన కాలుష్యభరిత నదీతీరాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, తక్కువ ఖర్చుతో కూడుకున్న శానిటేషన్, నదీ తీరాల్లో స్నానపు ఘాట్ల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని మంత్రి చెప్పారు.
నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ (ఎన్ఆర్సీపీ) కింద హైదరాబాద్, భద్రాచలం, మంచిర్యాల, రామగుండం ప్రాంతాల్లో మొత్తం 621.46 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ. 345.72 కోట్ల వ్యయంతో కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులను మంజూరు చేశామన్నారు. గోదావరి తీరం వెంట రాజమండ్రి వద్ద రూ. 21.78 కోట్లతో 30 ఎంఎల్డీ సామర్థ్యం కల్గిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) ఏర్పాటైందని ప్రహ్లాద్ సింగ్ జవాబులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ నది కాలుష్యాన్ని నివారించేందుకు 2007లోనే రూ. 335.65 కోట్లతో 593 ఎంఎల్డీ సామర్థ్యం కల్గిన ప్రాజెక్టును చేపట్టామని, రాజమండ్రిలో ఇప్పటికే ఉన్న ఎస్టీపీ సామర్థ్యాన్ని 30 ఎంఎల్డీ నుంచి 50.6కు పెంచడానికి రూ. 88.46 కోట్లతో ప్రాజెక్ట్ మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.