Saturday, January 11, 2025

TG | అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలి : సీఎం రేవంత్‌

  • క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఆవిష్కరణ
  • విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష
  • డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
  • ఉచిత సోలార్ పవర్, సోలార్ పంపుసెట్లు
  • ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్‌ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు.

తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ని సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి)లో ఆవిష్కరించారు. అనంతరం ఉన్నతాధికారులతో పాలసీపై సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్తు తీగలతో పాటు వివిధ రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్‌లో ఉండేలా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నారు.

అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్ట‌మ్ ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యం అరికట్టవ‌చ్చు అని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలను కూడా అధిగమించవచ్చని సీఎం రేవంత్ వివరించారు.

- Advertisement -

వచ్చే వేసవికి ముంద‌స్తు ప్రణాళిక..

వచ్చే వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో గతేడాది మార్చిలో రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరుకోగా, ఈసారి 16,877 మెగావాట్లకు చేరుకుంటుందని అధికారులు సీఎం రేవంత్‌కు వివరించారు.

ఈ నేప‌థ్యంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ అంచనా ప్రకారం ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్య‌మంత్రి అన్నారు. వ్యవసాయం, గృహావసరాలకు మార్చి నెలలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని… అందుకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు.

సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు…

గిరిజనులు, ఆదివాసీ గూడేలలో ఉచితంగా సోలార్‌ పవర్‌, సోలార్‌ పంపుసెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అటవీశాఖ, గిరిజన సంక్షేమ శాఖతోపాటు సంబంధిత శాఖలతో సమావేశమై వీలైనంత త్వరగా పూర్తి నివేదిక సిద్ధం చేయాలన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న కంపెనీలను ఆహ్వానించి వాటికి ఏ విధంగా పనులు అప్పగించాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఆర్థిక, విద్యుత్, ఇంధన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement