Friday, November 22, 2024

ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.. పార్లమెంట్‌లో ఎంపీ నామా డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎస్సీ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చాలాకాలమైనా వారి అంశాలను పట్టించుకోలేదని బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ఆరోపించారు. మాదిగల సుదీర్ఘ న్యాయ పోరాటానికి, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అండగా నిలవడంపై మాదిగ జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కావాలని పిడమర్తి రవి నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నడుస్తున్నందున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వందలాది మంది మాదిగ యువతతో నిరసన ప్రదర్శనలు, ధర్నా నిర్వహించామన్నారు.

మాదిగల పక్షాన పార్లమెంట్‌లో ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని లేవనెత్తాలని కోరగా నామా నాగేశ్వరరావు స్పందించారని గుర్తు చేశారు. నామా నాగేశ్వరరావు లోక్‌సభలో ఎస్సీ వర్గీకరణపై ప్రసంగించడం మాదిగ జాతికి మనోధైర్యాన్నిచ్చిందని గద్దల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక నామా మాదిగ జేఏసీ రాష్ట్ర నాయకత్వానికి ఫొన్ చేసి మరీ మాదిగల సమస్య పట్ల స్పందించారని తెలిపారు. ఇదే విధంగా తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు కూడా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు సాధన కోసం త్వరలో మాదిగ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement