Friday, November 22, 2024

మరో మూడు మెడికల్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని మరో మూడు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. జనగామ, కామారెడ్డి, వికారాబాద్‌ కళాశాలల్లో తరగతులు ప్రారంభించుకోవడానికి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసి) ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు బోధనా సిబ్బంది నియామకాన్ని సైతం పూర్తి చేసింది. ఈ మూడు కళాశాలల్లో ఒక్కో కళాశాలకు 100 చొప్పున మొత్తంగా 300 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

ఇటీవల సీఎం కేసీఆర్‌ 8 కొత్త మెడికల్‌ కళాశాలలను ఒకేసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జనగామ, నిర్మల్‌ జిల్లాలలో మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించింది. తాజాగా, ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను సైతం మంజూరు చేసింది.

- Advertisement -

ఈ కళాశాలలకు సంబంధించిన భవనాల నిర్మాణం, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం ప్రక్రియను జూలై నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త కాలేజీల పనుల పురోగతిపై ఆయా జిల్లాల మంత్రులు సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌కమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకరరావు సమీక్షించారు. దీంతో వీటిలో జనగామ, కామారెడ్డి, వికారాబాద్‌లో మెడికల్‌ కళాశాలల నిర్మాణం పూర్తి కావడంతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది నియామకం పూర్తయింది.

కాగా, మూడు కళాశాలల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసి మెడికల్‌ అసెస్‌మెంట్‌ రేటింగ్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేయడంతో మిగతా కాలేజీల అనుమతి ప్రక్రియ వివిధ దశల్లో ఉందనీ, వాటికి కూడా అనుమతి త్వరలోనే లభిస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, కొత్త మెడికల్‌ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి ఇప్పటికే కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, అభ్యర్థులకు వెబ్‌ ఆప్షన్లు కేటాయించారు.

మరోవైపు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. విద్యార్థుల హాస్టళ్ల భవనాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. ఈ కళాశాల నిర్మాణం పూర్తయిన పక్షంలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 15 సీట్లు నీట్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలిండియా కోటాలో కేటాయించనుండగా, మిగతా 85 సీట్లు మన రాష్ట్ర్ర అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఈ వైద్య కళాశాల కోసం ఇప్పటికే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో మొత్తం 340 బెడ్లను సిద్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement