హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగియడంతో సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. గతేడాది కంటే ఈసారి 9 కొత్త ప్రభుత్వ మెడకల్ కళాశాలలు వస్తున్నాయి. దీంతో 900 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. అలాగే, కొన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్రంలో 2023-24 వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కలిపి మొత్తం 8490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) ప్రకటించింది.
వీటిలో 27 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 3790 ఎంబీబీఎస్ సీట్లు కాగా, 29 ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4700 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న అన్ని సీట్లను, ప్రైవేట్ కళాశాలల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేసిన మార్పుల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కళాశాల్లలోని సీట్లలో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేయనుండగా, మిగతా 85 శాతం సీట్లను స్థానిక కోటాలో రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేస్తారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యుఎస్) కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, గతేడాది కంటే ఈసారి కొత్తగా 9 ప్రభుత్వ కళాశాలలు రావడంతో 900 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. అలాగే, కొన్ని ప్రైవేట్ కళాశాలల్లోనూ సీట్ల సంఖ్య పెరగడంతో జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి సైతం తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోనూ ఎంబీబీఎస్ సీటు వస్తుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు పేర్కొంటున్నారు.
కాగా, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన సిరిసిల్ల, భూపాలపల్లి, జనగాం, వికారాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిర్మల్ కళాశాలల్లో దాదాపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిందని ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు పేర్కొన్నారు. వీటిలో ఒక్కో కళాశాలలో వంద సీట్లు ఉండగా, అన్నింటిలోనూ 90కి పైగా విద్యార్థులు రిపోర్టు చేశారనీ, వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయిందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్తగా మంజూరైన మెడికల్ కళాశాలను సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ఒక్కో కళాశాలకు రూ.450 కోట్లు కేటాయించింది. వీటిలో భవన నిర్మాణ పనులు, నీటి సరఫరా, బోధన, బోధనేతర సిబ్బందికి క్వార్టర్స్, హాస్టల్ వసతి, సిసి కెమెరాల ఏర్పాట్లు వంటివి పూర్తి చేశారు. అలాగే, టీచింగ్ హాస్పిటల్స్‌లో నర్సుల కొరత లేకుండా కొత్త స్టాఫ్ నర్సుల పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో భర్తీ చేసింది.