జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులకు అమరులయ్యారు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. కోకర్‌నాగ్ సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్న అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది.
వెంటనే రంగంలోకి దిగిన సైనికులు.. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అహ్లాన్ గాడోల్ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి.. ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో సైనికులు, టెర్రరిస్ట్‌ల మధ్య ఎన్‌కౌంటర్ మొదలైనట్లు పోలీసులు తెలిపారు.
అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్న వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులకు గాయాలు కావడంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. వారు మరణించారు.
ఇక పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన పారాట్రూపర్లు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను పట్టుకునేందుకు.. అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.