జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని అడవుల్లో తుపాకుల మోత మోగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో జవాను తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 160 కిలోమీటర్ల దూరంలోని టోంటో ఏరియాలోని ఫారెస్టులో ఈ ఎదురుకాల్పులు సంభవించినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు.
వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని అడవుల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసు బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు సుశాంత్ కుమార్, మున్నా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం రాంచీకి హెలికాప్టర్‌లో తరలించారు. సుశాంత్ కుమార్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సుశాంత్‌కు బుల్లెట్ ఛాతీలోకి దూసుకెళ్లగా, మున్నాకు కాలిలోకి దూసుకెళ్లిందని పోలీసుల ఉన్నతాధికారులు పేర్కొన్నారు.