Friday, November 22, 2024

కృష్ణానది వద్ద తెలుగు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ.. రంగ ప్రవేశం చేసిన ఏపీ పోలీసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : నల్గొండ జిల్లా కృష్ణానది ఒడ్డున తెలుగు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలోని కృష్ణానది వద్ద సోమవారం మధ్యాహ్నం తెలంగాణ, ఏపీకి చెందిన మత్స్యకారుల మధ్య రగడ మొదలైంది. రెండు రాష్ట్రాల మత్స్యకారులు పరస్పర రాళ్లు రువ్వుకున్నారు. చేపలు పట్టుకునేందుకు రింగ్‌ వలలు వేయొద్దని నల్గొండ జిల్లా మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. ససేమిరా అన్న ఏపీ మత్స్యకారులు ఏమాత్రం పట్టించుకోకుండా రింగ్‌ వలలే వేసి చేపలు పట్టుకునే ప్రక్రియకు దిగారు. దీంతో ఏపీ మత్స్యకారులతో తెలంగాణ గంగపుత్రులు వాగ్వాదానికి దిగారు. ఏపీ మత్స్యకారులను బలవంతంగా చందంపేటకు తీసుకువచ్చి నిర్బంధించే ప్రయత్నం చేశారని ఏపీ మత్స్యకారులు ఆరోపించారు. ఇది తెలుసుకున్న ఏపీ పోలీసులు బోటులో చందంపేటకు చేరుకుని ఆ రాష్ట్ర మత్స్యకారులను విడిపించుకుని తీసుకువెళ్లారు. ఈ సందర్భంలోనూ ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అప్రమత్తమైన స్థానికులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

చందంపేట ప్రాంతంలో మత్స్యకారుల మధ్య గొడవలు తరచూ జరుగుతుంటాయని సోమవారం ఇది కాస్త ఉధృతమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే పరిస్థితి వచ్చిందని స్థానికులు తెలిపారు. పరిస్థితులు అదుపు తప్పుతున్న విషయాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టినట్టు వారు తెలిపారు. ఇరు వర్గాలను నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. నిత్యం తెలంగాణకు చెందిన మత్స్యకారులు ఏపీవైపు, ఆ రాష్ట్రానికి మత్స్యకారులు తెలంగాణ సరిహద్దులకు వచ్చి చేపల వేట చేస్తుండడం సహజమని ఎన్నో ఏళ్లుగా ఇది సాగుతోందని చెప్పారు. హఠాత్తుగా సోమవారం ఇరు రాష్ట్రాల మత్స్యకారులు గొడవకు దిగడం ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ చేతులకు పని చెప్పడంతో ఇది కాస్తా ఉద్రిక్తతకు దారి తీసిందని పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీ పోలీసులు ఘర్షణ విషయం చూసి వెనువెంటనే రంగంలోకి దిగారని ఇరు రాష్ట్రాల మత్స్యకారులతో సంప్రదింపులు జరిపి వారి మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేశారని చెప్పారు. రింగ్‌ వలలు వేసి చేపల వేట చేస్తే తమకు నష్టం వాటిల్లుతుందని ఎక్కువ చేపలు ఏపీ మత్స్యకారులకే దొరుకుతాయని తెలంగాణ మత్స్యకారులు భావిస్తున్నారు. మామూలు వలల ద్వారా చేపలు పట్టుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదని అందిరికీ సమన్యాయం జరుగుతుందని తెలంగాణ మత్స్యకారులు చెబుతున్నారు. మొత్తంమీద పోలీసుల రంగ ప్రవేశంతో ఇరు రాష్ట్రాల మత్స్యకారులు వెనక్కి తగ్గి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement