యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాపై నియంత్రణకు ఏదో ఒకటి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలకు ఉన్నట్లే ఏదైనా వ్యవస్థ ఉంటే చెప్పాలని అడిగారు. వెబ్ పోర్టళ్లపై నియంత్రణ లేకుండా పోతోందని, ఏవైనా ప్రచురించగలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా న్యాయవ్యవస్థకు కూడా స్పందించట్లేదని అన్నారు.
మరోవైపు దేశంలో విచ్చలవిడిగా నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని సీజేఐ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది దేశంలో కరోనా కేసులు పెరగడానికి తబ్లిగీ జమాతే సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. న్యాయమూర్తులు చెపుతున్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో శక్తిమంతమైన వ్యక్తులు చెప్తేనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకుంటున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వార్త కూడా చదవండి: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష విధించిన హైకోర్టు