Friday, November 22, 2024

నేత‌ల ప‌ల్ల‌కీ మోత‌లో సివిల్ స‌ర్వీస్ ఉద్యోగులు

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – స్వాతంత్య్రానంతరం మేధావులు కూలంకుషంగా అధ్యయనం చేసి రూపొందించిన రాజ్యాంగం మేరకే పాలన సాగాలని నిర్దేశించారు. రాజ్యాంగంలో మూడు ప్రధాన అంగాలను ప్రతిపాదించారు. ఇవి చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కాగా ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులతో కూడిన చట్టసభలు పాలనా పరంగా తీసుకునే నిర్ణయాల్ని రాజ్యాంగ బద్దతకు అనుగుణంగా అమలు చేసే బాధ్యతల్ని కార్యనిర్వాహక వ్యవస్థకు అప్పగించారు. ఈ రెండింటి పనితీరును మదింపు చేసి రాజ్యాంగ మౌలిక ఆదేశాలకు అనుగుణంగా నియంత్రణలో ఉంచే బాధ్యతను న్యాయవ్యవస్థకు కట్టబెట్టారు. సహజంగానే చట్టసభల పనితీరు మారింది. స్వాతంత్య్రం నాటి తొలి రోజులతో పోలిస్తే చట్టసభలకు ఎన్నికవుతున్న వారి వ్యక్తిగత చరిత్రల్లో సుదీర్ఘ మార్పులు గోచరిస్తున్నాయి. అయితే వీరి పదవీకాలం ఐదేళ్లు మాత్రమే తిరిగి ప్రజల ముందుకెళ్ళి తమ పాలనా విధానంపై తమ మద్దతు అభ్యర్థించాల్సిన పరిస్థితి వారికుంది. కానీ ఒక్కసారి ఉద్యోగంలో చేరితే 60ఏళ్ళ వరకు స్థిరపడగలిగే అవకాశం కార్యనిర్వాహక వ్యవస్థకుంది. ఈ వ్యవస్థ మొత్తం సివిల్‌ సర్వీస్‌ అధికారుల అదుపాజ్ఞల్లో కొనసాగుతోంది. ఈ అధికారుల ఆలోచనలు, సూచనలకనుగుణంగానే క్రిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది పనితీరు ఉంటోంది. ఆదిలో సివిల్‌ సర్వీస్‌ అధికారులు చట్టాల్ని కఠినంగా అమలు చేసేవారు. చట్టసభలు తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి లేని సమయంలో వాటి అమలును సైతం నిలిపేసేవారు. ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులకు తగిన సలహాలు, సూచనలిచ్చేవారు. రాజ్యాంగంపై వీరికి సంపూర్ణ అవగాహన ఉండేది. అందుకనుగుణంగానే దేశ పాలన నిర్వర్తించేవారు. ప్రజాప్రతినిధులు కూడా సివిల్‌ సర్వీస్‌ అధికారుల ఆలోచనలు, సూచనలకు పెద్దపీటేసేవారు. రాన్రాను సివిల్‌ అధికారుల వైఖరుల్లో మార్పులొచ్చాయి. ప్రజాప్రతినిధుల అండగా మెరుగైన పోస్టింగ్‌ల కోసం పోటీ మొదలైంది. అప్పటి నుంచి అధికార పార్టీకి వంతపాడ్డం ప్రారంభమైంది.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోని లోపాల్ని ఎత్తి చూపడం మాని రాజ్యాంగానికి లోబడని ఆదేశాల్ని సైతం అమలు చేయడం మొదలైంది. అప్పటి నుంచి పాలనా వ్యవస్థలో పలు మార్పులొచ్చాయి. పాలన గాడి తప్పింది. రాజ్యాంగంలోని అంశాలకనుగుణంగానే పాలన సాగాలన్న స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలితరం నాయకుల ఆలోచనలన్నీ పక్కకెళ్ళిపోయాయి. కాలానికనుగుణంగా పాలనా విధానంలో మార్పుల కోసం రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారాన్ని సైతం రాజ్యాంగ రూపకర్తలు కల్పించారు. పలు అంశాలకు సంబంధించి ఇప్పటికే వందకు పైగా సవరణలు జరిగాయి. కానీ పాలకుల ప్రయోజనాల్ని నెరవేర్చే అంశాలకు సంబంధించి చట్టబద్ద సవరణలకు అవకాశం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఇలాంటి అంశాలన్నింటిని కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా చలామణిలోకి తెచ్చుకుంటున్నారు.

దేశంలో బ్రిటీషీయులు ప్రవేశించకముందు అఖండ భారత్‌ పలు రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. పాలకులు తమ రాజ్యరక్షణ కోసం సైన్యాన్ని తయారు చేసుకునేవారు. అప్పట్లో గుర్రాలు, ఏనుగులు, ఒంటెలతో పాటు భారీ నౌకల్ని కూడా సైనిక సంపత్తిగా వినియోగించేవారు. కత్తులు, బల్లాలు వంటి ఆయుధాల్ని సైనికులకు అందించేవారు. బ్రిటీష్‌ ప్రవేశానంతరం పలు రాజ్యాలు బ్రిటీష్‌ పాలనలో కలిసిపోయాయి. అప్పటికి ఐదొందలకు పైగా సంస్థానాలు సొంత ప్రతిపత్తిని కాపాడుకుంటూ బ్రిటీష్‌ ప్రభుత్వానికి కప్పం చెల్లించేవి. అప్పుడు కూడా ఈ సంస్థానాలు సొంత సైనిక వ్యవస్థను నిర్వహించేవి. స్వాతంత్య్రానంతరం ఇలా వ్యక్తిగత సైన్యాలన్నింటిని రద్దు చేశారు. రక్షణ, ప్రజాభద్రత వ్యవస్థలన్నీ సర్వసత్తాక సార్వభౌమత్వ భారతదేశానికి దఖలయ్యాయి. రాజ్యాంగం మేరకు ఏ ఒక్కరు సొంత సైన్యం లేదా భద్రతా సిబ్బందిని కలిగి ఉండేందుకు వీల్లేదు. అయితే సివిల్‌ సర్వీస్‌ అధికారుల వ్యవహార శైలిలో లోపం కారణంగా ఇప్పుడు ప్రభుత్వ పోలీస్‌ దళాలే కొందరు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సైన్యాలుగా మారిపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకనుగుణంగానే ఇప్పుడీ సైన్యాలు ఆవిర్భవించాయి.

ప్రజాప్రతినిధుల ప్రాపకం కోసం ప్రాకులాడే సివిల్‌ సర్వీస్‌ అధికారులు ప్రభుత్వ బలగాల్ని వారి కాళ్ళముందు మోకరిల్లేలా చేస్తున్నారు. వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ బలగాలు తమ శక్తిని దుర్వినియోగం చేస్తున్నాయి. రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన వ్యవస్థలు విపక్షాలపై విరుచుకుపడ్డంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. రెండు రాజకీయ పార్టీల పరస్పర ఘర్షణల్లో నేరుగా తలదూరుస్తున్నాయి. శాంతిభద్రతల్ని కాపాడాల్సిన దళాలు అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలపై లాఠీలు ఝళిపిస్తున్నాయి. పాలకుల దమన నీతిని నిలదీసి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్షాల్ని అణిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటికి ఉన్నత స్థాయిలోని సివిల్‌ సర్వీస్‌ అధికారుల మౌఖిక ఆదేశాలు, వ్యవహారశైలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ దేశంలో ప్రభుత్వోద్యోగులు మూడు దశాబ్దాలకు పైబడి తమ సేవలందిస్తారు. వారి హయాంలో ఏడెనిమిది సార్వత్రిక ఎన్నికలు చూస్తారు. వారి కళ్ళముందే పలు పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి.. అధికారాన్ని కోల్పోతుంటాయి. ఎంతో ఉత్తుంగ తరంగంలా దూసుకొచ్చే నాయకులు కొన్నేళ్ళ వ్యవధిలోని చరిత్ర కాలగమనంలో కలసిపోతారు. ప్రజల మద్దతును ఉవ్వెత్తున కూడబెట్టిన మహామహులు అదే ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొన్న సంఘటనల్ని వారు ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ప్రతి ఐదేళ్ళకోసారి పాలకులు తమ పాలనా తీరుపై ప్రజల ముందు పరీక్ష రాయాల్సిందే. తిరిగి వారి మార్కులు పొందాల్సిందే. ఉత్తీర్ణులైతేనే మరోసారి అధికారం చలాయించే అవకాశముంటుంది. లేనిపక్షంలో విపక్ష పాత్రకు పరిమితం కావాలి. వీటిపై పూర్తి అవగాహన కలిగి కూడా సివిల్‌ సర్వీస్‌ అధికారులు అప్పటికి అధికారంలో ఉన్న వ్యక్తుల పల్లకీల్ని మోసేందుకు పోటీలు పడుతున్నారు. వారి ప్రాపకం కోసం రాజ్యాంగ నిర్దేశిత మౌలిక ఆదేశాల్ని కూడా పక్కన పెడుతున్నారు.

పవిత్రమైన రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తం గా సివిల్‌ సర్వీస్‌ అధికారులపై రోజు రోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. ఈ స్థాయి అధికారుల్లో అవినీతి జాడ్యం పెరిగినప్పటి నుంచి దేశ పాలనా వ్యవస్థ భ్రష్టుపట్టిందన్న ఆరోపణలున్నాయి. అత్యున్నత స్థాయి అధికారుల అక్రమార్జన పర్వాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఇది క్రిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందిలోనూ అవినీతి పట్ల ధైర్యాన్ని పెంచుతోంది. మొత్తం పాలనా వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తోంది. సివిల్‌ సర్వీస్‌ వ్యవస్థలో సంస్కరణల్ని అమలు చేయాల్సిన అవసరముందంటూ తరచూ పలువురు మేథావులు, ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న డిమాండ్‌పై రాజ్యాంగ నిపుణులు స్పందించాల్సిన అవసరం స్పష్టమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement