హైదరాబాద్: చిత్రపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
గద్దర్ అవార్డు కమిటీసభ్యులతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం భేటీ అయ్యారు. అక్టోబర్ 14న కమిటీ సభ్యులతో భేటీ అయిన భట్టి తాజాగా మరోసారి సమావేశమయ్యారు.గద్దర్ అవార్డు లోగో, విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించారు.
గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి పేర్కొన్నారు. కమిటీ సభ్యుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగాది రోజున ఈ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.