Wednesday, November 27, 2024

Delhi | లవ్ లెటర్ అందుకున్నా.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో సీఐడీ నోటీసులు అందుకున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తనకు లవ్ లెటర్ అదిందని బదులిచ్చారు. శనివారం రాత్రి గం. 7.00 నుంచి 7.05 వరకు ‘మోత మోగిద్దాం’ పేరుతో ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో గంట మోగిస్తూ శబ్దం చేసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ‘మోత మోగిద్దాం’ పేరుతో తమ చేతిలో ఉన్న వస్తువులతో శబ్దం చేస్తూ నిరసన తెలపాలని నిన్న ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఆ మేరకు ఢిల్లీలో గల్లా జయదేవ్ నివాసంలో ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, రఘురామకృష్ణ రాజు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి లోకేశ్ ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. కొందరు గంట మోగించగా, మరికొందరు చేతిలో ప్లేట్, స్పూన్ పట్టుకుని శబ్దం చేశారు. ఇంకొందరు విజిల్ ఊదుతూ శబ్దం చేయగా.. యువనేత అడారి కిశోర్ కుమార్ శంఖం ఊదుతూ శబ్దం చేశారు. ఈ ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. దర్యాప్తు సంస్థ సీఐడీ పూర్తిగా వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందని విమర్శించారు.

లేని కేసులు సృష్టించి ఇబ్బందిపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని, త్వరలో జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ఇంట్లో పెట్టి శాశ్వతంగా తాళం వేసే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలపాలని తాము నిర్ణయించుకున్నామని అన్నారు. సీఐడీ నోటీసులపై స్పందిస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని, ఎలాంటి భూసేకరణ జరగనేలేదని, అయినా సరే కేసు పెట్టారని అన్నారు. హెరిటేజ్ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి 40 కి.మీ దూరంలో 9 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేస్తే.. దాన్ని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆ కొనుగోలు పూర్తి పారదర్శకంగా.. వ్యాపార విస్తరణలో భాగంగా జరిగిందని, పైగా తాను మంత్రిగా పదవి చేపట్టగానే హెరిటేజ్ సంస్థకు రాజీనామా చేసి బయటకు వచ్చేశానని అన్నారు. ఈ లావాదేవీల్లో ఎలాంటి తప్పు జరగలేదని, జగన్ తరహాలో క్విడ్ ప్రో కో చేసి తానేమీ పత్రికలు, టీవీ ఛానెళ్లు పెట్టుకోలేదని అన్నారు. సీఐడీ ఇచ్చిన నోటీసు స్వీకరించానని, తానేమీ జగన్ మాదిరిగా వాయిదాలు కోరబోనని అన్నారు. జగన్ తన కేసుల్లో ఇప్పటి వరకు 2 వేలకు పైగా వాయిదా కోరారని నారా లోకేశ్ గుర్తుచేశారు. విదేశాలకు వెళ్లాలంటే వారికి కోర్టు నుంచి అనుమతులు కావాలని, ఆ పరిస్థితి తమకు లేదని అన్నారు.

- Advertisement -

అసలు ఎలాంటి తప్పూ జరగలేదని, ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే తనను మొదట శిక్షించేది చంద్రబాబు నాయుడే అని లోకేశ్ వ్యాఖ్యానించారు. మరోవైపు తాను ఢిల్లీలోనే ఉన్నానని, నిత్యం మీడియాతో చిట్ చాట్ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నానని, కానీ కొందరు మాత్రం పనిగొట్టుకుని ఎక్కడో దాక్కున్నట్టు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. తాను రాష్ట్రపతిని కలిసిన రోజు విదేశాలకు పారిపోయినట్టు ప్రచారం చేశారని అన్నారు. సదరు మీడియా సంస్థలపై తాను చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని లోకేశ్ అన్నారు.

ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసులు నడుస్తున్నాయని, వాటిలో దేంతోనూ తనకు సంబంధం లేదని చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే ఫైబర్ గ్రిడ్ నిర్ణయాలు జరిగాయని అన్నారు. మిగతా రెండు కేసులతో అస్సలు సంబంధం లేదని చెప్పారు. నాడు సంతకాలు చేసిన అధికారులు అజయ్ కల్లాం రెడ్డి, ప్రేమ్ చంద్రా రెడ్డిని వదిలేసి తమ పేర్లు కేసుల్లో చేర్చారని ఆరోపించారు. న్యాయపోరాటంలో భాగంగా తాను హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా వంటి ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నానని, అందుకోసమే ఢిల్లీలో ఉంటున్నానని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement