Thursday, November 21, 2024

Delhi | సీఐడీ చీఫ్ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు.. అమిత్ షాకు ఎంపీ రామ్మోహన్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఈమేరకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గురువారం ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్ర‌మించి మ‌రీ సంజయ్ వైసీపీకి తొత్తుగా ప‌ని చేస్తున్నాడని, సీఎం వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి కోసం ప్ర‌తిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆల్ ఇండియ‌న్ స‌ర్వీస్ రూల్స్ ప్రకారం రాజ‌కీయ ప‌క్ష‌పాతాలు లేకుండా ప‌ని చేయాల్సిన సీఐడీ చీఫ్ నియమ నిబంధనలు ఉల్లంఘించార‌ంటూ హోంమంత్రికి ఆధారాలు సమర్పించారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ప్ర‌తిప‌క్ష‌ నేత చంద్ర‌బాబుని అరెస్టు చేసి విచార‌ణ జరపాల్సిన అధికారి, ఎలాంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే, స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్‌మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్ర‌మైన నేరమని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ద‌ర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టుల‌కి నివేదించాల్సిన బాధ్య‌త గ‌లిగిన ఐపీఎస్ అధికారి వైసీపీ నేత‌లా ఢిల్లీ, హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో ప్రెస్‌మీట్లు పెడుతూ ప్ర‌తిప‌క్ష నేత‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారని ఆరోపించారు. గోప్యంగా ఉంచాల్సిన దర్యాప్తు అంశాలను మీడియాకు విడుద‌ల చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement