ఢిల్లీ: ఏసు క్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి ఏసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ, ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు.
చిన్న వయసులో తనకు క్రైస్తవ మతస్తులతో మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. విద్య, వైద్య రంగంలో క్రైస్తవులు ఎన్నో సేవలందిస్తున్నారని కితాబునిచ్చారు. పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యాయం ఉండాలనేది ఏసు క్రీస్తు ఆశయమని అన్నారు. దయ, కరుణ, సేవ అనే ఆదర్శాలతో జీవించాడని చెప్పారు. ఉన్నత విలువలు పాటిస్తూ వారసత్వ రక్షణపై మనందరం దృష్టి సారించాలని సూచించారు. సరస్పర సహకారం, సమన్వయంతో అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.