Tuesday, November 26, 2024

చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడు: ఎయిమ్స్..

అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ కరోనాతో మరణించాడంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలపై తీహార్‌ జైలు డీజీ, ఎయిమ్స్‌ అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడని స్పష్టం చేశారు. తీహార్‌ జైలులో ఖైదీగా ఉన్న రాజేందర్‌ సదాశివ్‌ నికల్జే అలియాస్‌ చోటారాజన్‌కు గత నెల 22వ తేదీ కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయనను 24వ తేదీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని జైలు డీజీ తెలిపారు. చోటా రాజన్‌ బ్రతికే ఉన్నాడని, ఎయిమ్స్‌లో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారని ఎయిమ్స్‌ అధికారులు ట్విటర్‌ వేదికగా స్పష్టత నిచ్చారు.

గత సోమవారం చోటా రాజన్ కరోనా లక్షణాలు ఉన్నాయంటూ తీహార్ జైలు అసిస్టెంట్ జైలర్ టెలిఫోన్ ద్వారా అక్కడ సెషన్స్ కోర్టుకు సమాచారం ఇచ్చారు.దీంతో గ్యాంగ్‌స్టర్ ను కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించి ఎయిమ్స్‌లో చేర్పించినట్లు తెలిపారు. 61 ఏళ్ల రాజన్ 2015 లో ఇండోనేషియాలోని బాలి నుండి బహిష్కరించబడిన తరువాత అరెస్టు అయినప్పటి నుండి న్యూ ఢిల్లీలోని హై-సెక్యూరిటీ తీహార్ జైలులో ఉన్నారు. ముంబైలో దోపిడీ, హత్యలకు సంబంధించి 70 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ముంబైలో 2011లో ఓ జర్నలిస్టును హత్య చేసినట్లు నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో ఛోటా రాజన్‌కు 2018లో జీవిత ఖైదు విధించారు. అయితే హనీఫ్ లక్డవాలా హత్య కేసులో రాజన్, ఆయన సహచరుడు నిర్దోషులని ఇటీవలే ముంబైలోని సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement