శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి హజారయి..కీలక కామెంట్స్ చేశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ బాగా పడిపోయిందని, విజయాల శాతం మహా అయితే 20 శాతం ఉంటుందని అన్నారు. ఏవో కొన్ని సినిమాలు ఆడితే ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉందని అనుకోరాదని పేర్కొన్నారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే గానీ ఢొక్కాడనివాళ్లు ప్రత్యక్షంగా వేలమంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారని వెల్లడించారు.
“ఐదారుగురు హీరోలో, ఐదారుగురు నిర్మాతలో, ఐదారుగురు దర్శకులో బాగున్నంత మాత్రాన సినిమా పరిశ్రమ మొత్తం బాగుందని కాదు. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది. కరోనా సమయంలో షూటింగులు నాలుగైదు నెలలు ఆగిపోయే సరికి చిత్ర పరిశ్రమ దుస్థితి సుస్పష్టమైంది. విరాళాలతో కార్మికులను ఆదుకోగలిగాం. మరోవైపు సినిమా ఉత్పాదక వ్యయం పెరిగిపోయింది. బడ్జెట్లు పెరుగుతున్నాయి కానీ ఆదాయాలు మాత్రం రావడంలేదు. దీనిపై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అర్థిస్తున్నాం. ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ సీఎంను ప్రత్యేకంగా అర్థిస్తున్నాను. ఏ నలుగురు హీరోలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటారు కానీ చిత్ర పరిశ్రమ మొత్తం అలాగే ఉందని భావించవద్దు. అగ్రహీరోలను దృష్టిలో ఉంచుకుని మిగతా అందరూ బాధపడేలా దయచేసి నిర్ణయాలు తీసుకోవద్దు. సభాముఖంగా మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వంకాయలు, బీరకాయల వంటి వాటిని మనం చూసి కొంటాం, కానీ కొన్న తర్వాత చూసేది సినిమా మాత్రమే.
అలాంటి సినిమా ఎందుకు చూస్తారంటే మా మీద నమ్మకం. అందుకే ప్రేక్షకులను నిరుత్సాహ పరచకుండా ఉండేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి ఖర్చు పెరిగిపోవచ్చు. ఈ విషయంలో మాకు సహకరించాలని కోరుకుంటున్నాం… మేం ఆశతో అడగడం లేదు సర్.. అవసరం కొద్దీ అడుగుతున్నాం. దయచేసి సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించండి. ఆచార్య సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థంకావడంలేదు. ఆదాయం వస్తుందో రాదో అన్న సందేహాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతో ఉంది” అని చిరంజీవి తన మనోభావాలను వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి: పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం.. సీఎం జగన్ ఏమన్నారంటే..