Thursday, November 21, 2024

ప్రముఖ పర్యావరణ వేత్త సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత

ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించిన సుందర్‌లాల్ బహుగుణ(94) శుక్రవారం నాడు కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెట్లను కొట్టివేయకుండా కాపాడే ప్రయత్నంలో 1974లో వాటిని కౌగిలించుకోవడం ద్వారా చిప్కో ఉద్యమానికి తెరలేపిన ఆయన.. తెహ్రీ ఆనకట్టపై నిరసనలు చేపట్టారు. చెట్లతో పాటు అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల కోసం తన జీవితాంతం సుందర్ లాల్ బహుగుణ పరితపించారు.

కాగా సుందర్‌లాల్ బహుగుణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.దేశంలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కాగా సుందర్ లాల్ బహుగుణ భౌతిక కాయానికి రిషికేష్‌లోని గంగానదీ తీరంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

1970లో చిప్కో ఉద్యమానికి సుందర్‌లాల్ బహుగుణ శ్రీకారం చుట్టారు. చూస్తోండగానే ఈ ఉద్యమం ఊపందుకుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా కొనసాగిన అనేక ఉద్యమాల్లో దీనిది ప్రథమస్థానం. ఉద్యమంలో భాగంగా సుందర్‌లాల్ బహుగుణ 1981-83 మధ్య హిమాలయ పర్వత ప్రాంతాల్లో 500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. దాని ఫలితంగా హిమాలయ పర్వత సాణువుల్లో చెట్ల నరికివేతను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement