హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెంగాణలో చిప్‌ల ప్యాకేజింగ్‌కు సంబంధించి పరిశ్రమ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చిప్ పరిశ్రమను నెలకొల్పడానికి ఆసక్తి చూపించిన వ్యాపార దిగ్గజం టాటా గ్రూపులో భాగమైన టాటా ఎలక్ట్రానిక్స్ తాజాగా చిప్ ప్యాకేజింగ్ యూనిట్‌ను ఇక్కడ స్థాపించడానికి యోచిస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశంలో చిప్ తయారీ పరిశ్రమలు నెలకొల్పడానికిగాను కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్(ఐఎస్‌ఎమ్)లో భాగంగా ప్రకటించిన రూ.76వేల కోట్ల ప్యాకేజీ విండోకు టాటా దరఖాస్తు చేయలేదు. అయితే టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతానికి చిప్ ప్యాకేజింగ్ యూనిట్ స్థాపనపైనే దృష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ యూనిట్ నెలకొల్పేందుకుగాను తెలంగాణతో పాటు తమిళనాడు,కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలను కూడా తెలంగాణతో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ షార్ట్ లిస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 15 తర్వాత ఏ రాష్ట్రంలో చిప్ ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నది ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. ఓఎస్‌ఓటీ (అవుట్ సోర్స్‌డ్ అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ అండ్ టెస్ట్) పద్ధతిలో చిప్ ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేయనున్నట్లు టాటా ఎలక్ట్రానిక్స్ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. వేఫర్ టెక్నాలజీలో చిప్ ప్యాకేజింగ్ కంటే ఓఎస్‌ఓటీ పద్ధతిలో ప్యాకేజింగ్ తయారీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఓఎస్‌ఓటీ తరహా చిప్ ప్యాకేజింగ్ యూనిట్ నెలకొల్పే విషయమై టాటా ఎలక్ట్రానిక్స్ ప్రకటన కోసం వేచి చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటీవలే మరో రెండు ఈఎంసీలు ప్రకటించిన ప్రభుత్వం
ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ఇప్పటికే ఉన్న రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)లకు తోడు మరో ఈఎంసీలను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల రేడియెంట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యూనిట్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈఎంసీలలో లేదంటే ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చిప్ ప్యాకేజింగ్ యూనిట్ నెలకొల్పడానికిగాను భూములివ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎస్‌ఐఐసీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలున్నాయని చెప్పారు. టాటా ఎలక్ట్రానిక్స్ చిప్ ప్యాకేజింగ్ యూనిట్ రాష్ట్రానికి వస్తే పెట్టుబడుల విషయంలో తెలంగాణ ఇమేజ్ మరింత పెరుగుతుందని, దీని ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..