ఇది చైనా నౌక. హైటెక్ నౌక. దీని పేరు యువాన్ వాంగ్ 5. బాలిస్టిక్ క్షిపణుల, ఉపగ్రహాల ఆనవాళ్లను ట్రాకింగ్ చేస్తుంది. ఇప్పుడిది శ్రీలంక వెళ్లింది. హిందూ మహాసముద్రం మీదుగా. భారత్ ఆందోళనంతా ఇందుకే. వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో దేశ రక్షణ వ్యవస్ధల ఆనుపానుల్ని పసిగట్టిందేమోనని భారత రక్షణ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దక్షిణ శ్రీలంకలోని హాంబన్‌టోటో పోర్టులో గురువారమే లంగరు వేయాల్సింది.
కాని ఇంకా క్లియరెన్సు ఇవ్వలేదు. బహుశ ఈనెల 17దాకా అది చేరకపోవచ్చు. భారత్ అభ్యంతరాలను శ్రీలంక చైనాకు తెలియజేసింది. కాని చైనా ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ నౌక చేరాల్సిన పోర్టుని చైనా నౌకాయాన శాఖే నిర్వహిస్తున్నది. ఇది శ్రీలంకలో తిష్ట వేస్తే భారత్ రక్షణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భారత రక్షణ శాఖాధికారులు భావిస్తున్నారు.