Friday, November 22, 2024

చందమామపై చైనా అణు స్థావరం!

రాబోయే ఆరేళ్లలో చందమామపై అణు విద్యుత్‌ శక్తి ఆధారిత స్థావరాన్ని నిర్మించనున్నట్లు చైనా వెల్లడించింది. చైనా లూనార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రోగ్రామ్‌ చీఫ్‌ డిజైనర్‌ వు వియ్‌రాన్‌ ప్రభుత్వ అధికారిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టంచేసినట్టు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తన నివేదికలో స్పష్టంచేసింది. ”మరో ఆరేండ్లలో చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేస్తాం. అది అణు విద్యుత్‌ ఆధారంగా పనిచేస్తుంది. వచ్చే పదేండ్లలో మా వ్యోమగాములు చంద్రుడిపైకి చేరుకుంటారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ల్యాండర్‌, హాపర్‌, ఆర్బిటర్‌, రోవర్‌ అనే నాలుగు కీలక భాగాలుంటాయి.” వు వియ్‌రాన్‌ స్పష్టం చేశారు. అయితే చంద్రుడిపై స్థావరం కోసం చైనా స్పేస్‌ ఏజెన్సీ ఎలా ప్రణాళికను అనుసరిస్తున్నదో చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

కానీ, చైనా చంద్రుడిపై ఏర్పాటు చేయబోయే అణు శక్తి ఆధారిత స్థావరం ఒక మెగావాట్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుందని, దాంతో ఒక ఏడాదిపాటు వందలాది ఇండ్లకు విద్యుత్‌ను అందజేయవచ్చని ఎస్‌సీఎంపీ తన నివేదికలో పేర్కొన్నది. చైనా అంచనాల ప్రకారం.. అణు శక్తితో వెలువడే విద్యుత్‌తో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. చంద్రుడిపై వివిధ పరికరాలను ఆపరేట్‌ చేయవచ్చు. నీటిని వెలికితీయవచ్చు. మొత్తానికి 2028 నాటికి చందమామపై చైనా అణు విద్యుత్‌ ఆధారిత స్థావరం పూర్తికానుందని నివేదిక వెల్లడించింది. ఆ లోగా చంద్రుడిపై నీటి జాడలు, ఇతర అంశాలను అధ్యయనం చేయడం కోసం మానవర#హత లూనార్‌ మిషన్స్‌ను ప్రయోగించాలని చైనా భావిస్తున్నదని తెలిపింది. చంద్రుడి మీది వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనాలు ఎన్నో ఏండ్లుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement